చేతి నరాల గాయాలకు ఆలస్యం ప్రమాదకరం... డాక్టర్ పి ప్రకాష్

- చేతి నరాల గాయాలకు ఆలస్యం ప్రమాదకరం: డా. పి. ప్రకాష్

 

మహబూబ్‌నగర్, జూలై 16 ( ఆర్కే న్యూస్ బ్యూరో): రోడ్డు ప్రమాదాల అనంతరం చేయి కదలకపోవడం, స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదిస్తే చేయి తిరిగి సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్ ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జన్, బ్రేక్యల్ ప్లెక్సస్ నిపుణుడు డా. పి. ప్రకాష్ తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బ్రేక్యల్ ప్లెక్సస్ ఇంజురీ అనేది చేతికి కదలికలు, స్పర్శను అందించే నరాలు దెబ్బతినే తీవ్రమైన సమస్య అని వివరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహన ప్రమాదాల్లో యువత, టీనేజ్ వయస్సు వారిలో ఈ గాయాలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదం తర్వాత చేయి పూర్తిగా పనిచేయకపోవడం, భుజం లేదా మోచేయి కదలకపోవడం, చేయి చచ్చుబడినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపించినా చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఫిజియోథెరపీతోనే సరిపెట్టుకుంటున్నారని, దీంతో చికిత్స ఆలస్యం కావడంతో శస్త్రచికిత్స ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవని ఆయన పేర్కొన్నారు.

దెబ్బతిన్న నరాల తీవ్రతను బట్టి నరాలను తిరిగి కలపడం, నర్వ్ ట్రాన్స్‌ఫర్, కండరాల మార్పిడి, టెండన్ ట్రాన్స్‌ఫర్ వంటి ఆధునిక శస్త్రచికిత్సల ద్వారా చేతి పనితీరును గణనీయంగా పునరుద్ధరించవచ్చని డా. ప్రకాష్ తెలిపారు. బ్రేక్యల్ ప్లెక్సస్ ఇంజురీపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల బాధితులు, వారి కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది ఈ అవకాశాన్ని వినియోగించుకుని సకాలంలో నిపుణుల సలహాలు పొందాలని ఆయన కోరారు.